APSRTC: ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు... సంస్థను బతికించుకోవడానికి పెంచక తప్పలేదన్న మంత్రి

  • పల్లెవెలుగు బస్సుల్లో కిమీకి 10 పైసలు పెంపు
  • ఇతర బస్సుల్లో కిమీకి 20 పైసలు పెంపు
  • చార్జీల పెంపునకు సీఎం ఆమోదం ఉందన్న మంత్రి పేర్ని నాని

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఇతర బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచారు. దీనిపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బస్సు చార్జీల పెంపునకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని వెల్లడించారు. చార్జీల పెంపు అమలు తేదీని రేపు గానీ, ఎల్లుండి గానీ ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని తెలిపారు.

ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలంటే చార్జీల పెంపు తప్పదని అన్నారు. ఆర్టీసీని బతికించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాలు రూ.6,735 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తోందని పేర్ని నాని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీలు పెంచకపోతే సంస్థ దివాలా తీయడం ఖాయమని అన్నారు.

More Telugu News