Justice for disa: ఎన్ కౌంటర్ మృతుల గ్రామం గుడిగండ్లలో మళ్లీ ఉద్రిక్తత.. మృతదేహాల కోసం కుటుంబీకుల డిమాండ్

  • రహదారిపై బైఠాయించి నిరసన 
  • చివరి చూపునకు కూడా నోచుకోలేదని ఆవేదన 
  • మద్దతుగా నిలిచిన గ్రామస్థులు

ఎన్ కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఈరోజు ఉదయం నిరసనకు దిగడంతో వారి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా గుడిగండ్ల గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ బిడ్డల మృతదేహాలు అప్పగించి చివరి చూపునకైనా నోచుకునే అవకాశం కల్పించాలంటూ తల్లిదండ్రులు భోరున విలపిస్తూ గ్రామం ప్రధాన రహదారి పై బైఠాయించారు.

వాస్తవానికి నిన్న సాయంత్రమే మృతదేహాలు అప్పగించి అంత్యక్రియలు జరిగేలా చూడాలని పోలీసులు భావించినా వారి ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ విషయం తెలియని బాధితులు రాత్రి పది గంటల వరకు మృతదేహాల కోసం ఎదురు చూశారు. రోడ్డుపై బైఠాయించి మృతదేహాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విషయం తెలియజేసి వారిని శాంతింపజేశారు.

అయితే మళ్లీ ఈ రోజు ఉదయం బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి మృతదేహాలు అప్పగించాలని కోరారు. వీరికి గ్రామస్థులు కూడా మద్దతుగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తారేమోనన్న అనుమానంతో ఆందోళన వ్యక్తం చేశారు.

'మా కుటుంబీకుల అంత్యక్రియలు నిర్వహించడానికి మీరెవరు? వారి మృతదేహాలు మాకు అప్పగించండి. మా సంప్రదాయం ప్రకారం మేమే కార్యక్రమం నిర్వహించుకుంటాం' అంటూ డిమాండ్ చేశారు. తమకు సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు.

దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పారు. కోర్టు ఆదేశాలను వివరించి శవాలను మీకే అప్పగిస్తామని, మీరే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని తెలియజేయడంతో శాంతించి వెనుదిరిగారు.

More Telugu News