warangal yasid case: ఆనాటి ఘటన నీడలా నా వెన్నంటే ఉంది: వరంగల్ యాసిడ్ దాడి బాధితురాలు ప్రణీత

  • అద్దం ముందు నిల్చుంటే జరిగింది గుర్తుకు వస్తుంది
  • ఎన్ కౌంటర్లతోనే బాధితులకు న్యాయం జరగదు
  • ఆడపిల్లల పట్ల అమానుషత్వం ఆగేలా చూడాలి

హైదరాబాద్ లో దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ తో 1998లో వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ ఒక్కసారిగా జనం మదిలో మెదిలింది. బాధితులు వేరైనా నిందితులకు పడిన శిక్ష ఒకేలా ఉండడమే ఇందుకు కారణం.

స్నేహితురాళ్లయిన స్వప్నిక, ప్రణీత కళాశాలకు వెళ్లి స్కూటర్ పై తిరిగి వస్తుండగా వారిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించగా 20 రోజుల తర్వాత స్వప్నిక చనిపోయింది. ప్రణీత క్రమంగా కోలుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రణీత దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 'ఇటువంటి సందర్భాల్లో ఎన్‌కౌంటర్లతోనే న్యాయం జరిగిందనుకోవడం పొరపాటు. మాకు జరిగిన నష్టం తిరిగి వస్తుందా? సామాజిక పరిస్థితుల్లో మార్పు రానంత వరకు ఇటువంటి తీర్పుల వల్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదు' అని వ్యాఖ్యానించారు.

'నేను సాధారణ కళాశాల విద్యార్థిని. నేనేం తప్పుచేశాను. నాపై దాడి తర్వాత నా శరీరానికి 14 ఆపరేషన్లు జరిగాయి. ఇప్పటికీ నా జీవితం, శరీరం సాధారణ స్థితికి రాలేదు. అద్దం ముందు నిల్చున్నప్పుడుల్లా జరిగిన ఘోరం గుర్తుకు వస్తుంది. భయంతో వణికిపోతాను. ఓసారి బిజినెస్ పనిమీద విదేశాలకు వెళ్లాల్సి వస్తే మీరు శారీరకంగా ఫిట్ గా ఉన్నారా? అని టీం లీడర్ ప్రశ్నిస్తే హతాశురాలినయ్యాను.

నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. వారి చావుకు మేము కారణమయ్యామని ఎవరైనా అంటే ఇప్పటికీ బాధనిపిస్తుంది. వారు తప్పుచేశారు, శిక్ష అనుభవించారు. కానీ ఏ తప్పూ చేయని నేను జీవితాంతం శిక్ష అనుభవిస్తున్నాను' అంటూ ప్రణీత నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ వాపోయారు.

ఎన్‌కౌంటర్ల వల్ల బాధితుల్లో ఆత్మసైర్యం పెరగదని, అత్యవసర సమయాల్లో పోలీసులు తక్షణం స్పందిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. తప్పుచేస్తే ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం సమాజంలో నెలకొన్నప్పుడే ఇలాంటి మృగాళ్లకు ముకుతాడు వేయగలమన్నారు. తప్పుచేసినా ఎవరూ పట్టుకోలేరని, ఒకవేళ పట్టుకున్నా బెయిల్ పై బయటకు వచ్చేయవచ్చునని ఉన్న ధైర్యమే పలువురిని నేరాలకు పురిగొల్పుతోందని ప్రణీత అభిప్రాయపడింది.

దిశ హత్య కేసు నిందితులు కూడా అటువంటి ధైర్యంతోనే ఈ దురాగతానికి ఒడిగట్టారని ప్రణీత వ్యాఖ్యానించారు. నిందితులు ఏ స్థాయి వారైనా, తప్పుచేస్తే  పక్కాగా దర్యాప్తు జరిపి పకడ్బందీగా విచారణ నిర్వహించి శిక్ష పడేలా చేస్తే కచ్చితంగా మార్పు వస్తుందన్నారు.

More Telugu News