మా పార్టీ నేతలకు లేనివి మంత్రి పదవులు మాత్రమే.. తలలు కాదు: బీజేపీపై విరుచుకుపడిన శివసేన

07-12-2019 Sat 08:11
  • బీజేపీ వ్యాఖ్యలకు శివసేన ఘాటు కౌంటర్
  • తమది 80 రోజుల ప్రభుత్వం కాదన్న శివసేన
  •  తన బాధ్యతలేంటో ప్రభుత్వానికి తెలుసు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8 రోజులైనా ఇచ్చిన మాట ప్రకారం స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటి వరకు ఎటువంటి మంత్రత్వ శాఖలు కేటాయించలేదంటూ బీజేపీ చేసిన విమర్శలపై శివసేన ఘాటుగా స్పందించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో బీజేపీపై విరుచుకుపడింది. తన బాధ్యతలేంటో ప్రభుత్వానికి తెలుసని, ఒకరు చెప్పాల్సిన పనిలేదని దుమ్మెత్తిపోసింది.

 రాష్ట్ర వ్యవహారాలను ప్రశాంతంగా ఎలా నిర్వహించాలో అవగాహన ఉందని పేర్కొంది. పార్టీ నేతలకు మంత్రి పదవులు మాత్రమే లేవని, తలలు కాదని ఘాటుగా బదులిచ్చింది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, శాఖల కేటాయింపును పూర్తిచేస్తామని, ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నడిపిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అనవసర విమర్శలు సరికాదని హితవు పలికింది. తమది 80 రోజుల ప్రభుత్వం కాదని, ఐదేళ్లపాటు సుదీర్ఘ పాలన అందించే ప్రభుత్వమని శివసేన తేల్చిచెప్పింది.