నిందితులను అదుపులోకి తీసుకుని ఎన్‌కౌంటర్ చేసే వరకు జరిగింది ఇదీ!

07-12-2019 Sat 07:31
  • రెండు రోజులపాటు నిందితుల రహస్య విచారణ
  • పది రోజుల కస్టడీకి తీసుకుని రెండు రోజుల్లోనే ముగింపు
  • మరిన్ని కీలక ఆధారాలు సేకరణ
దిశ హత్య కేసు నిందితులను రెండు రోజుల క్రితమే కస్టడీలోకి తీసుకున్నట్టు ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు చెప్పడంతో ఆ రెండు రోజులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఏం చేశారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులను కనీసం పది రోజులపాటు విచారించాలని కోర్టుకు తెలిపిన పోలీసులు రెండు రోజుల్లోనే వారి కథ ముగించారు. అంతేకాదు, ఆ రెండు రోజులు ఎవరి కంటా పడకుండా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు ఈ కేసులో వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ సమాచారం ఏంటన్నది తెలియరాలేదు.

దిశపై జరిగిన హత్యాచార ఘటనను పరిశీలించిన పోలీసులు ఇది సాధారణ వ్యక్తులు చేసిన పని కాదని అనుమానించారు. పక్కాగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం, అనంతరం హతమార్చి మృతదేహాన్ని కాల్చేయడం చూస్తుంటే మొదటిసారి ఇలాంటి దురాగతానికి తెగబడిన వారి పనికాదని, ఇటువంటి విషయాల్లో వారు కరుడుగట్టి ఉంటారన్న విషయం అర్థమవుతోంది.

 ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఈ మధ్య కాలిపోయిన మూడు మహిళా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ హత్యల వెనక కూడా వారి హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. గతంలోనూ వారేమైనా నేరాలకు పాల్పడ్డారా? అన్న విషయాలను కూడా పోలీసులు ఆరా తీశారు.

అంతేకాదు, వారి వ్యక్తిగత వ్యవహారాలు, నేర ప్రవృత్తి పెరగడానికి కారణాలపై విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. దిశను హత్య చేసిన తర్వాత నిందితులు ఐదు గంటలపాటు మృతదేహాన్ని తమతో పాటు ఎందుకు ఉంచుకున్నారు? ఘటనా స్థలం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్‌పల్లికి ఎందుకు తీసుకెళ్లారు? అన్న సందేహాలకు కూడా పోలీసులు సమాధానాలను రాబట్టినట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు రహస్యంగా వారిని విచారించిన పోలీసులు వారి నుంచి మరిన్ని విషయాలను రాబట్టినట్టు సమాచారం. అయితే, ఈ విషయాలను పోలీసులు వెల్లడించలేదు.