వారికో న్యాయం.. మాకో న్యాయమా?: ఎన్‌కౌంటర్‌లో హతమైన చెన్నకేశవులు భార్య

07-12-2019 Sat 07:08
  • మక్తల్ రోడ్డుపై బైఠాయించిన నిందితుల బంధువులు
  • ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులనూ ఇలానే ఎన్‌కౌంటర్ చేస్తారా?
  • కొంతకాలానికైనా తిరిగి వస్తాడనుకున్నా
దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుల బంధువులు నిన్న రాత్రి మక్తల్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా గర్భిణి అయిన నిందితుడు చెన్నకేశవులు భార్య మాట్లాడుతూ.. తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాలని, లేకుంటే తనను కూడా పూడ్చేయాలని కన్నీటి పర్యంతమైంది. తమ వారి స్థానంలో ఎమ్మెల్యే, ఎంపీ కొడుకులున్నా ఇలానే చంపేస్తారా? అని ప్రశ్నించింది. డబ్బుంటే ఒక న్యాయం, లేకుంటే మరో న్యాయమా? అని నిలదీసింది.

దేశంలో అత్యాచారాలకు పాల్పడి జైలుకెళ్లిన వారిని అక్కడ తీరిగ్గా కూర్చోపెట్టి మేపుతున్నారని పేర్కొన్న ఆమె.. తన భర్త కూడా కొంతకాలానికి తిరిగి వస్తాడని అనుకున్నానని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని రోదించింది. ఇప్పుడు తనకు దిక్కెవరంటూ ఆమె రోదించింది.