Uttar Pradesh: చికిత్స పొందుతూ కన్నుమూసిన ఉన్నావో అత్యాచార బాధితురాలు

  • కోర్టుకు వెళ్తున్న బాధితురాలిపై దాడి
  • కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన నిందితులు
  • సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో‌కు చెందిన అత్యాచార బాధితురాలు గత అర్ధరాత్రి కన్నుమూసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.

గతేడాది డిసెంబరులో బాధితురాలు అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించిన నిందితుడు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గత నెల 25న విడుదలయ్యాడు. బయటకు వచ్చిన నిందితుడు తనను జైలుకు పంపిన ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను హతమార్చేందుకు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.

అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టుకు హాజరయేందుకు గురువారం ఆమె గ్రామం నుంచి బయలుదేరగా ఐదుగురు నిందితులు కాపుకాసి ఆమెను అడ్డగించి దాడిచేశారు. ఆపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేదీ కూడా సజీవ దహనానికి యత్నించిన వారిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News