Disha: ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ: మృతదేహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలని ఆదేశం

  • ఈ సాయంత్రం అందిన వినతి పత్రంతో హైకోర్టు అత్యవసర విచారణ
  • ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్
  • ఈ నెల 9న మరోసారి విచారణ

దిశ ఘటనలో నిందితులను ఇవాళ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కేసు రీ కన్ స్ట్రక్షన్ కోసం నిందితులను సంఘటన స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో ఈ సాయంత్రం అత్యవసరంగా విచారణ నిర్వహించారు.

సాయంత్రం 6 గంటల సమయంలో అందిన వినతి పత్రంపై హైకోర్టు అత్యవసరంగా స్పందించింది. మృతదేహాలను ఈ నెల 9వ తేదీ వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు హైకోర్టు ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపనుంది.

కాగా, ఈ సాయంత్రం జరిగిన విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్య నిపుణుల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని ఆయన కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసినట్టు వెల్లడించారు. దాంతో హైకోర్టు స్పందిస్తూ, పోస్టుమార్టం వీడియోను మహబూబ్ నగర్ జిల్లా జడ్జికి అప్పగించాలని, ఆయన ఆ వీడియో సీడీని తమకు సమర్పిస్తారని స్పష్టం చేసింది.

More Telugu News