ఎన్ కౌంటర్ భావోద్వేగంతో మాట్లాడే అంశం కాదు: జగ్గారెడ్డి

06-12-2019 Fri 20:35
  • మా పార్టీ స్పందన కూడా తెలియాల్సి ఉంది
  • ఏ వ్యవస్థ చేసే పని అదే చేయాలి
  • నాడు వరంగల్ ఎన్ కౌంటర్ తర్వాత దాడులు ఆగిపోలేదు

దిశ కేసు నిందితులను పోలీసులు ఈరోజు ఉదయం ఎన్ కౌంటర్ చేసిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆచి తూచి స్పందించారు. దీనిపై భావోద్వేగంతో స్పందించడం సరికాదని, పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే స్పందిస్తానని అన్నారు. ఈ ఘటనపై తమ పార్టీ విధానం ఏమిటో వెల్లడయ్యే వరకూ వేచి చూడాలని, ఈ ఎన్ కౌంటర్ పై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పారు.

'అమానుష ఘటనలకు పాల్పడే నిందితులను ఎవరూ వెనకేసుకురారు. కానీ, ఏ వ్యవస్థ చేసే పని వారు చేయాలి' అని ఆయన పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ లతో సమస్య పరిష్కారం అయితే సంతోషమేనని, పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు. గతంలో వై.యస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఇలానే చేశారని, ఆ తర్వాత ఆడవారిపై చాలా దాడులు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని అన్నారు.