Pawan Kalyan: ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి: 'ఎన్ కౌంటర్'పై పవన్ కల్యాణ్

  • ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దు
  • మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలిపెట్టకూడదు
  • కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడాలి

హత్యాచార ఘటన జరిగిన రాత్రి ఆ నలుగురు పోకిరీల మధ్య 'దిశ' ఎంత నరకాన్ని అనుభవించిందో తలచుకుంటేనే తనలో ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఆయన స్పందిస్తూ ప్రకటన చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని అనుకోవద్దని, మహిళలపై దారుణాలకు పాల్పడే మృగాళ్లను వదిలిపెట్టకూడదని అన్నారు.

ఇలాంటి కేసుల్లో కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని, కేవలం రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని పవన్ అభిప్రాయపడ్డారు. గతంలో నిర్భయ ఘటన తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్‌ తీసుకొచ్చినప్పటికీ అత్యాచారాలు ఆగలేదని అన్నారు. మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అమ్మాయిల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలని, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

More Telugu News