Encounter: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 6 వరకూ... ఎప్పుడేం జరిగిందంటే..!

  • తెలంగాణ పోలీసు చరిత్రలో మరపురాని రోజు
  • పది రోజుల్లోనే దిశ ఘటనకు పరిష్కారం   
  • హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్

డిసెంబర్ 6, 2019... తెలంగాణ పోలీసు చరిత్రలో ఈ రోజు మిగిలిపోతుంది. వెటర్నరీ డాక్టర్ దిశను నవంబర్ 27న పక్కా ప్లాన్ ప్రకారం హత్యాచారం చేసిన నలుగురు నిందితులనూ ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చారు. ఈ పది రోజుల వ్యవధిలో ఎప్పుడు ఏం జరిగిందో మరోసారి పరిశీలిస్తే...

నవంబర్ 27: బ్యూటీ పార్లర్ కు వెళ్లాలన్న ఆలోచనలో వెటర్నరీ డాక్టర్ దిశ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తొండుపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకుని అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసింది. అక్కడి నుంచి క్యాబ్ లో మాదాపూర్ వెళ్లింది. ఆమెను చూసిన నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు ముందుగానే అత్యాచారం చేయాలని ప్లాన్ చేశారు. కావాలనే ఆమె వాహనానికి పంచర్ వేశారు. ఆమె రాగానే, పంచర్ వేయిస్తామన్న నెపంతో మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు. ఆపై బలవంతంగా మద్యం నోట్లో పోసి, అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు.

నవంబర్ 28: చటాన్ పల్లి బ్రిడ్జ్ వద్ద ఓ మృతదేహం ఉందన్న విషయం పోలీసులకు తెలిసింది. అప్పటికే తమ బిడ్డ కనిపించడం లేదని దిశ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, వారిని పిలిపించిన పోలీసులు, ఆ మృతదేహం ఆమెదేనని గుర్తించి, విచారణ ప్రారంభించారు. పంక్చర్ వేయించుకుని వస్తానని బండిని తీసుకెళ్లిన అతనికి దిశ ఫోన్ చేసి వుండటంతో, అదే ప్రధాన క్లూగా పోలీసులు విచారణ జరిపి, 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.

నవంబర్ 30: నలుగురు నిందితులనూ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల కస్టడీ విధించారు. అప్పటికే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కాగా, ప్రజల నిరసనలు మిన్నంటాయి. నిందితులను తమకు అప్పగించాలని ప్రజలు ఆందోళనకు దిగగా, పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వారిని ఎన్ కౌంటర్ చేసి చంపేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. నిందితులను భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించి, గట్టి బందోబస్తు మధ్య వారిని ఉంచారు.

డిసెంబర్ 1: ఈ కేసు విచారణకు ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకూ దిశకు న్యాయం చేయాలని ప్రజలు వీధుల్లోకి వచ్చారు. క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.

డిసెంబర్ 2: నిందితులను మరింతగా విచారించాల్సి వున్నదని, వారిని రెండు వారాల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

డిసెంబర్ 3: జైలులో తమతో మాట్లాడిన సిబ్బందికి తాము చేసినదంతా పూసగుచ్చినట్టు చెప్పిన ప్రధాన నిందితుడు ఆరిఫ్, దిశ బతికుండగానే సజీవదహనం చేశామని చెప్పాడు. ఈ వార్త బయటకు రావడంతో ప్రజల్లో ఆగ్రహం మరింతగా పెరిగింది.

డిసెంబర్ 4: కస్టడీకి ఇవ్వడంపై విచారణ పూర్తి కాగా, వారం రోజుల పాటు వారిని కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

డిసెంబర్ 5: నలుగురు నిందితులనూ కస్టడీలోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, రాత్రి సమయంలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలికి వారిని తీసుకుని వచ్చారు.

డిసెంబర్ 6: తెల్లవారుజామున 3 గంటల సమయంలో దిశను సజీవ దహనం చేసిన చోటు, ఫోన్ ను పాతిపెట్టిన చోటు కోసం వెతుకుతున్న సమయంలో నిందితులు తప్పించుకోవాలని చూశారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ పరిగెడుతుంటే, ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో నలుగురూ మరణించారు.

More Telugu News