Chidambaram: తన జైలు జీవితంపై చిదంబరం స్పందన

  • జైల్లో చెక్క బల్లపై పడుకున్నా
  • వెన్నుపూస, మెడ బలంగా తయారయ్యాయి
  • మానసికంగా, శారీరకంగా మరింత బలవంతుడినయ్యా

తీహార్ జైల్లో శారీరకంగా, మానసికంగా తాను మరింత బలవంతుడిగా తయారయ్యానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. జైలు నుంచి నిన్న సాయంత్రం బెయిలుపై విడుదలైన చిదంబరం... ఈరోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు, ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జైల్లో తాను గడిపిన 106 రోజులు చెక్క బల్లపై పడుకున్నానని... దీంతో తన వెన్నుపూస, మెడ బలంగా తయారయ్యాయని చెప్పారు. తాను దైవాన్ని విశ్వసిస్తానని, కోర్టులపై తనకు నమ్మకం ఉందని అన్నారు.

కేంద్ర మంత్రిగా తనకు చాలా మంచి రికార్డు ఉందని చిదంబరం చెప్పారు. తనతో పని చేసిన ఉద్యోగులు, తనతో చర్చలు జరిపిన పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, తనను ఇంతకాలం నిశితంగా గమనించిన జర్నలిస్టులకు ఈ విషయం తెలుసని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తప్పులు చేస్తోందని విమర్శించారు. సంక్షోభం నుంచి ఆర్థిక స్థితిని గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పార్లమెంటులో తన గొంతుకను ఈ ప్రభుత్వం అణచలేదని చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News