Uppal: రేపు బ్లాక్ డే నేపథ్యంలో ఉప్పల్ మ్యాచ్ కు భారీ బందోబస్తు

  • రేపు హైదరాబాదులో భారత్-వెస్టిండీస్ తొలి టి20
  • డిసెంబరు 6న నగరంలో బ్లాక్ డే!
  • మ్యాచ్ ను అడ్డుకుంటే కఠినచర్యలు తప్పవన్న సీపీ

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టి20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత దినమైన డిసెంబరు 6న నగరంలో బ్లాక్ డే నేపథ్యంలో మ్యాచ్ కు కట్టుదిట్టమైన రీతిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ, హైదరాబాద్ క్రికెట్ సంఘంలో కొత్తగా కొలువుదీరిన అజహరుద్దీన్ కార్యవర్గం చేపడుతున్న తొలి మ్యాచ్ ఇదని, ఈ మ్యాచ్ కోసం పూర్తిస్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

మ్యాచ్ కోసం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని, బ్లాక్ డే సందర్భంగా ఎవరైనా మ్యాచ్ ను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉప్పల్ మ్యాచ్ కోసం 1800 మంది పోలీసులను భద్రతా విధుల కోసం రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. త్రివర్ణ పతాకం తప్ప మరే ఇతర జెండాలు స్టేడియంలోకి అనుమతించబోమని, బ్యాగులు, లైటర్లు,సిగరెట్లు, ల్యాప్ టాప్ లు, ఆహార వస్తువులు, నాణేలు, పెన్నులు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్, హెల్మెట్లు స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

More Telugu News