Karnataka: 'ఆరు'నూరైనా గెలవాల్సిందే... లేదంటే యెడ్డీ సీటుకి ఇబ్బందే!

  • కర్ణాటకలో అధికార పార్టీలో టెన్షన్ 
  • ఉప ఎన్నికల తర్వాత తేలనున్న సీఎం భవితవ్యం 
  • ఆరుగురు సభ్యులు గెలవకుంటే ప్రభుత్వం పడిపోతుంది

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పరిస్థితి నిప్పుల కుంపటిపై ఉన్నట్లుంది. ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటో అంతుపట్టనట్టు ఉంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నా ఓటర్ల మూడ్ ను ఆ పార్టీ నాయకులు అంచనా వేయలేకపోతున్నారు. కనీసం ఆరు స్థానాల్లో విజయం సాధించకుంటే ప్రభుత్వ మనుగడ కష్టసాధ్యం కావడంతో అధికార పార్టీలో ఒకటే టెన్షన్. 

కాంగ్రెస్ తరపున గెలిచి బీజేపీలోకి ఫిరాయించడంతో 15 మంది సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయడం.. దీన్ని కోర్టు కూడా సమర్థించడంతో ఈ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి చావో రేవోలా మారాయి. 223 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ బలం 106. మేజిక్ ఫిగర్ దాటాలంటే మరో ఆరుగురు సభ్యులు అవసరం.

ఇక ఎన్నికలు జరుగుతున్న స్థానాలేవీ బీజేపీవి కావు. ఫార్టీ ఫిరాయించిన సిటింగ్ ఎమ్మెల్యేలను జనం ఎంతమేరకు ఆదరిస్తారన్న దానిపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. చావో రేవో పరిస్థితులు కావడంతో గెలవడానికి అధికార బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. మరోవైపు తమ స్థానాలే బీజేపీ లాక్కున్నందున ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, విజయం తమదేనని విపక్ష కాంగ్రెస్ ఎదురు చూస్తోంది. మరి వాస్తవం ఏమిటన్నది ఈ నెల 9వ తేదీన వెలువడే ఫలితాలను బట్టి తేలుతుంది.

More Telugu News