Pawan Kalyan: మత మార్పిడుల మీద ఉన్నంత ఉత్సాహం రైతుల సమస్యలు తీర్చడంపై లేదు: పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు

  • వైసీపీకి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు
  • ఆరు నెలల్లో వైసీపీ చేసింది ఏంటీ?
  • రైతులకు గిట్టుబాటు ధర అందించాలి
  • లేదంటే అమరావతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తాను

రైతుల కష్టాలు తనకు తెలుసని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డ్ లో టమోటా రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వానికి మతమార్పిడులపై ఉన్నంత ఉత్సాహం  రైతుల సమస్యలు తీర్చడంపై లేదని విమర్శించారు.

'వైసీపీకి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ఆరు నెలల్లో వైసీపీ చేసింది ఏంటీ? మాజీ ముఖ్యమంత్రి ఇల్లును కూల్చేద్దాం. గతంలో ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేద్దాం.. అన్న విషయాలపైనే వారి దృష్టి ఉంది. అంతేకానీ రైతులకు గిట్టుబాటు ధర అందించడంపై లేదు. పవన్ కల్యాణ్ ను తిట్టాలి, అలా తిట్టే విషయాలపైనే వారి దృష్టి ఉంది' అని విమర్శించారు.

'రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు. రైతులందరూ మీపై తిరగబడతారు.. అర్థం చేసుకోండి. మొదట రైతుల కడుపులు నింపండి. రైతులకు అండగా ఉండకుండా ఆంగ్ల మాధ్యమం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలు, రైతుల క్షేమం కోసం నేను పర్యటనలు చేస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

'నేను ఇక్కడకు వస్తానని ప్రకటిస్తే నన్ను అడ్డుకుంటామని వైసీపీ నేతలు సవాళ్లు వదిలారు. మీరు మారాలి జగన్ రెడ్డి గారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు. కానీ, మాకు ప్రజల అండ ఉంది. మమ్మల్ని ఆపాలని ప్రయత్నిస్తే కుదరదు' అని పవన్ అన్నారు.

'వైసీపీ ప్రభుత్వం వచ్చి భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టింది. ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మత మార్పిడుల మీద ఉన్నంత ఉత్సాహం రైతుల సమస్యలు తీర్చేందుకు లేదు. వారికి అండగా ఉండే విషయంపై లేదు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు గిట్టుబాటు ధరపై నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అమరావతిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తాను. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు' అని పవన్ హెచ్చరించారు. 

More Telugu News