Btech student missing: చనిపోయే మార్గాలపై నెట్ లో అన్వేషణ.. అనంతరం యువకుడి అదృశ్యం

  • ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
  • ఇంటికి వచ్చి వెళ్లిన రోజే ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన కుటుంబం

ఇంటి నుంచి వెళ్లిన కొడుకు కొన్ని గంటల తర్వాత కనిపించకుండా పోవడం, అదృశ్యం కావడానికి ముందు చనిపోవడం ఎలా? అనుకూలమైన ప్రాంతం ఎక్కడ? అని ఇంటర్నెట్ లో వెతకడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే...నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి సమీపంలోని పాతూరుకు చెందిన గుంట్రోజు సతీష్ (26) బీటెక్ చదివాడు. సాఫ్ట్ వేర్ లో శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చాడు. శ్రీనగర్ కాలనీలోని త్రిపతి వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. పది రోజుల క్రితం సొంతూరు వెళ్లాడు.

ఈనెల 2న రాత్రి 7 గంటల సమయంలో తండ్రి మాధవాచారి అతడిని హాస్టల్ వద్ద వదిలి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లిపోయిన మాధవాచారి రాత్రి 9 గంటల సమయంలో కొడుకుకి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. కంగారుపడిన ఆయన తిరిగి హాస్టల్‌కు వెళ్లి చూడగా కొడుకు కనిపించ లేదు. బ్యాగులో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. సీసీ కెమెరా పుటేజీ పరిశీలిస్తే హాస్టల్ వద్ద తండ్రి వదిలి వెళ్లిన పది నిమిషాలకే సతీష్ బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించారు.

దీంతో ఆందోళన చెందిన మాధవాచారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి సతీష్ గది తనిఖీ చేయగా చనిపోవడానికి అనుకూలమైన ప్రాంతం ఏది? నిద్ర మాత్రలు ఎన్ని మింగితే చనిపోతారు? వంటి అంశాలతోపాటు జమ్ముకశ్మీర్, తిరుపతి ప్రాంతాలను నెట్ లో చూసినట్లు గుర్తించారు. దీంతో అతని ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News