Mehbooba Mufti: ముస్లింలను రెండో తరగతి ప్రజలుగా చూపించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారు: మెహబూబా ముఫ్తీ కుమార్తె 

  • పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
  • వచ్చే వారం పార్లమెంటు ముందుకు రానున్న బిల్లు
  • దేశంలో ముస్లింలకు చోటెక్కడుందని ప్రశ్నించిన సనా

భారత్ లో ముస్లింలకు చోటెక్కడుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజా జావెద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారం ఈ బిల్లు పార్లమెంటుకు రానుంది.

ఈ నేపథ్యంలో సనా తన తల్లి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ముస్లింలపై వివక్షను చూపేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురాబోతోందని ఆరోపించారు. దేశంలో ముస్లింలకు చోటు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలను రెండో తరగతి ప్రజలుగా చూపేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత వేధింపులకు గురై... భారత్ కు వలస వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశింపబడిన ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదముద్ర వేసింది. మరోవైపు, ఈ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇస్లామిక్ దేశాల నుంచి వలస వచ్చిన వారిలో హిందువులే ఎక్కువగా ఉంటారని... ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం ఇచ్చి, వారిని ఎన్నార్సీ నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.

More Telugu News