Nirmala Seetaraman: నేనేమీ పెద్దగా ఉల్లిపాయలు తిననుగా: నిర్మలా సీతారామన్!

  • ఉల్లి ధరలపై పార్లమెంట్ లో చర్చ
  • ధరల ప్రభావం ఆర్థిక మంత్రికి తెలియదన్న విపక్షాలు
  • గట్టి కౌంటర్ ఇచ్చిన నిర్మలా సీతారామన్

ఆకాశాన్నంటిన ఉల్లిపాయల ధరలపై పార్లమెంట్ లో వాడివేడిగా చర్చ జరుగుతున్న వేళ, తన ప్రసంగాన్ని పదేపదే అడ్డుకుంటున్న విపక్ష సభ్యులపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెటైర్లు వేశారు. తమ ఇంట్లో పెద్దగా ఉల్లిపాయలు తినబోమని ఆమె అన్నారు.

 "మా ఇంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి పెద్దగా వాడం. కాబట్టి మీరేమీ బాధపడకండి. ఉల్లిపాయలు పెద్దగా వాడని కుటుంబం నుంచి నేను వచ్చాను" అని ఉల్లిపాయల వినియోగం, పెరిగిన ధరలతో ఏర్పడిన కష్టాలు ఆర్థికమంత్రికి తెలియడం లేదని వ్యాఖ్యానించిన విపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.

ఆపై నిర్మల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుందని తెలిపారు. భారీ ఎత్తున ఉల్లిపాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అతి త్వరలో ఉల్లిపాయలు ఇండియాకు వస్తాయని, కొరత అధికంగా ఉన్న చోటుకు వీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. ఉల్లి రైతులకు, వినియోగదారులకు మధ్య కూడా మధ్యవర్తులు వ్యవస్థను శాసిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాగా, కోల్ కతాలో కిలో ఉల్లిపాయల ధర రూ. 150కి చేరింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కిలో ధర రూ. 100 నుంచి రూ. 120 మధ్య పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రభుత్వ మార్కెట్ల ద్వారా సబ్సిడీ ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నా, తమ అవసరాలు మాత్రం అరకొరగానే తీరుతున్నాయని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News