Telangana: తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు, ఏపీలో పెరగనున్న బస్ చార్జీలు!

  • మద్యం ధరలను భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం
  • ఇటీవల ఆర్టీసీ చార్జీలు పెంచిన కేసీఆర్ సర్కారు
  • తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాన్ని తొలగించే ప్రయత్నాలు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత తానిచ్చిన దశలవారీ మద్య నిషేధ హామీ అమలులో భాగంగా మద్యం ధరలను జగన్ సర్కారు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ఏపీతో పోలిస్తే, తెలంగాణలో ధరలు చాలా తక్కువగా ఉండటంతో సరిహద్దు జిల్లాల నుంచి అక్రమ మద్యం తరలి వెళుతోంది. భద్రాచలం, కోదాడ, పెబ్బేరు నాగార్జునసాగర్, మిర్యాలగూడ, మధిర తదితర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు, దాన్ని ఏపీలోని ఎమ్మార్పీ ధరలతో పోలిస్తే కాస్తంత తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు.

ఈ విషయం అలా ఉంచితే, ఇటీవల 50 రోజులకు పైగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఆపై వారు సమ్మెను విరమించగా, నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కేసీఆర్ సర్కారు 20 శాతం మేరకు బస్ టికెట్ ధరలను పెంచింది. దీంతో తెలంగాణ బస్సులతో పోలిస్తే, ఏపీ బస్సులో ధరలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఏపీ బస్సులనే ఎక్కుతున్నారు. టికెట్ ధరల పెంపుతో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా తిరుపతి, విజయవాడ, కర్నూలు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే తెలంగాణ వాసులు ఏపీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటు ఆర్టీసీ, ఇటు ఎక్సైజ్ విభాగాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మద్యం ధరల బేస్ ప్రైస్ ను 25 శాతం మేరకు పెంచాలని మద్యం డిస్ట్రిబ్యూటర్లు కోరుతుండగా, ఎక్సైజ్ శాఖ ఈ దిశగా ఆలోచిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కు 17 డిస్టిలరీ కంపెనీలు మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రాథమిక ధరను పెంచాలని ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ కు విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, అనుమతి లభిస్తే ధరలు పెంచుతామని ఆయన చెప్పినట్టు తెలిసింది.

మరోవైపు ఏపీలో నాలుగేళ్ల నుంచి ఆర్టీసీ చార్జీల ధరలను పెంచలేదు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ సాలీనా రూ. 1000 కోట్ల నష్టంలో నడుస్తుండగా, దీన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి నుంచి ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు చెల్లించనుండటం, పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో చార్జీలను పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం.

వాస్తవానికి ఏపీలో గత నాలుగేళ్ల వ్యవధిలో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 70.67 నుంచి 81.08కు పెరిగింది. అయినా నష్టాలు మాత్రం తప్పడం లేదు. ఓ రెగ్యులేటరీ కమిషన్‌ ను నియమించాలని భావిస్తున్న జగన్ సర్కారు, రానున్న శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించాలని, ఆపై చార్జీల పెంపును పరిశీలించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

More Telugu News