ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్సుల్లో మళ్లీ నెంబర్ వన్ గా కోహ్లీ

  • స్మిత్ ను అధిగమించి టాప్ స్థానం కైవసం
  • బంగ్లాతో టెస్టులో 136 పరుగులతో రాణించిన విరాట్
  • బౌలింగ్ లో బుమ్రాకు ఐదో స్థానం

బంగ్లాదేశ్ తో ఆడిన డే అండ్ నైట్ టెస్ట్ లో 136 పరుగులు చేసి రాణించిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానాన్ని పొందాడు. ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్సుల్లో కోహ్లీ 928 పాయింట్లతో జాబితాలో అగ్ర భాగాన నిలిచాడు.

 కాగా తొలి స్థానంలో ఉన్న ఆసీస్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ పాక్ తో ఆడిన రెండో టెస్టులో 36 పరుగులు మాత్రమే చేయడంతో అతని పాయింట్లు 931 నుంచి 923కు తగ్గాయి. దీనితో స్మిత్ రెండో స్థానానికి దిగజారాడు. ఛటేశ్వర్ పుజారా స్థిరంగా తన నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. అజింక్య రహానే ఒక ర్యాంక్ దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ పై ట్రిబుల్ సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు.

ఈ ఏడాది ప్రారంభంలో 110 ర్యాంకులో ఉన్న మార్నస్ లబుషేన్ టాప్ 10లోకి ప్రవేశించాడు. మార్నస్ 8వ స్థానంలోకి వచ్చాడు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జోరూట్ 11వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకాడు. తొమ్మిదో స్థానంలో కివీస్ క్రికెటర్ హెన్రీ నికోలస్ ఉండగా, పదో స్థానంలో శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నే ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత స్పీడ్ స్టర్ జస్ర్పీత్ బుమ్రా ఐదో స్థానంలో ఉండగా, అశ్విన్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ లో అగ్ర స్థానంలో ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు.

More Telugu News