Justice for disa: దిశపై అసభ్యకర పోస్టులు పెట్టి, పైశాచికానందం పొందుతున్న యువకుడి అరెస్టు

ఆశ్లీల చిత్రాలు మార్ఫింగ్ చేసి పోస్టింగ్

సభ్యపదజాలంతో వ్యాఖ్యలు జోడింపు 

నిందితుడు నిజామాబాద్ జిల్లా వాసి

దిశపై అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ ఘటన దేశాన్ని కుదిపేసింది. మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించింది. నలుగురి మృగాళ్ల అమానుషత్వం పలువురి కంట కన్నీరు తెప్పించింది. 

ఓపక్క దేశమంతా ఆవేదనతో రగిలిపోతుంటే ఆ యువకుడు మాత్రం దిశపై అసభ్యకర పోస్టులను సామాజిక మాధ్యమాల్లో ఉంచి తన పైశాచిక తత్వాన్ని చాటుకున్నాడు. అశ్లీల చిత్రాలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నాడు. దీన్ని గుర్తించిన నెటిజన్లు అగ్రహంతో రగిలిపోయారు. విషయాన్ని రాచకొండ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి రెండురోజుల క్రితం తీసుకువెళ్లారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోస్టులు పెడుతున్న 'స్టాలిన్ శ్రీరామ్' పేరుతో ఉన్న ఖాతాను పరిశీలించారు. ఇందుకు బాధ్యుడిగా నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన చవన్ శ్రీరామ్ ను గుర్తించారు. దీంతో అతనిపై వలపన్నారు. ఇది గుర్తించిన శ్రీరామ్ అప్పటికే అందులో పెట్టిన పోస్టింగ్స్ తొలగించినా అతని ఆచూకీ గుర్తించి నిన్న అరెస్టు చేశారు.

అలాగే, సామాజిక మాధ్యమాల్లో దిశపై అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్న మరికొందరిని కూడా గుర్తించారు. ఇన్ స్టాగ్రామ్ లో నీచమైన భాషతో వ్యాఖ్యలు చేసిన నలుగురు యువకుల అడ్రస్సులు గుర్తించారు. అలాగే 'స్మైలీ' పేరుతో అశ్లీల వీడియోలు ఉంచిన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇతను గుంటూరు జిల్లాలో ఉన్నాడని గుర్తించి వెళ్లినా అప్పటికే పరారు కావడంతో నెల్లూరు, ప్రకాశం , గుంటూరు జిల్లాల్లో ఇతని కోసం గాలిస్తున్నారు.

More Telugu News