Sharad Pawar: ఫడ్నవీస్ తో అజిత్ పవార్ టచ్ లో ఉన్నట్టు నాకు తెలుసు.. కానీ, అంత దూరం వెళతాడనుకోలేదు: శరద్ పవార్

  • కాంగ్రెస్ నేతల తీరు అజిత్ కు నచ్చలేదు
  • అదే రోజు రాత్రి ఫడ్నవీస్ తో మంతనాలు జరిపారు
  • డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను

సొంత పార్టీపై తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపి, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి, ఆ తర్వాత రాజీనామా చేసి, మళ్లీ సొంతగూటికే చేరిన అజిత్ పవార్ పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో అజిత్ పవార్ టచ్ లో ఉన్నట్టు తనకు తెలుసని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇటు కాంగ్రెస్, శివసేనతో పాటు మరోవైపు బీజేపీతో కూడా ఎన్సీపీ చర్చలు జరిపిందని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అజిత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని... ఇదే ఆయన తిరుగుబాటుకు కారణం అయి ఉండవచ్చని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పదవుల కోసం డిమాండ్ చేసిందని... అది నచ్చక సమావేశం నుంచి తాను వెళ్లిపోయానని... తనతో పాటు అజిత్ కూడా బయటకు వచ్చేశారని శరద్ పవార్ తెలిపారు. అదే రోజు రాత్రి ఫడ్నవీస్ తో అజిత్ మంతనాలు సాగించారని చెప్పారు. అయితే, అంత దూరం వెళతారని మాత్రం ఊహించలేకపోయానని అన్నారు. నవంబర్ 23న డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. బీజేపీతో అజిత్ చేతులు కలపడం చాలా మంది ఎన్సీపీ నేతలకు మింగుడుపడలేదని... అయితే, ఆయన తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారని అన్నారు.

ప్రధాని మోదీతో జరిగిన భేటీలో బీజేపీకి ఎన్సీపీ మద్దతిచ్చే అంశంపై మాత్రమే చర్చ జరిగిందని శరద్ పవార్ తెలిపారు. తనకు రాష్ట్రపతి పదవి, తన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వజూపారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు.

More Telugu News