Disha: 'దిశ' బతికుండగానే కాల్చేశాం... జైల్లో కాపలా జవానుతో చెప్పిన ప్రధాన నిందితుడు ఆరిఫ్!

  • అరుస్తుంటే ఎవరైనా వింటారని భయపడ్డాం
  • నోట్లో మద్యం పోస్తే అపస్మారక స్థితిలోకి
  • అత్యాచారం తరువాత సజీవదహనం
  • మాట కలిపిన జవాన్లకు చెప్పిన నిందితుడు 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అత్యాచార ఘటనలో మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. తొలుత దిశను హతమార్చిన తరువాత కాల్చి వేశారని భావిస్తుండగా, ఇప్పుడామెను సజీవ దహనం చేశారన్న వాస్తవం వెల్లడైంది. నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు జవాన్లు వారితో మాట కలపగా, ప్రధాన నిందితుడు ఆరిఫ్, ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని పూస గుచ్చినట్టు చెప్పాడట.

దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకుని లాక్కెళ్లామని, ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే, ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని బలవంతంగా నోట్లో పోశామని, అప్పటికే తీవ్ర భయంతో ఉన్న ఆమె స్పృహ తప్పగా అత్యాచారం చేశామని ఆరిఫ్ చెప్పినట్టు జైలు సిబ్బందిలో ఒకరు వెల్లడించారు. మద్యం తాగించడంతో పాటు అత్యంత క్రూరంగా ప్రవర్తించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టామని చెప్పాడట.

కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులూ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండగా, వారిని కస్టడీకి ఇచ్చే విషయంలో నేటి ఉదయం 11 గంటల తరువాత షాద్ నగర్ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే షాద్ నగర్ కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. నిందితులను కోర్టుకు తీసుకువస్తే, ప్రజలు ఆందోళనకు దిగే అవకాశాలు ఉండటంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపించాలని పోలీసులు ఇప్పటికే నిర్ణయించారు.

More Telugu News