Sankranti: సంక్రాంతి పోటీని తట్టుకోలేక... డిసెంబర్ లోనే వచ్చేస్తున్న బాలయ్య, వెంకటేశ్!

  • సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు
  • విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు, దర్బార్, అల వైకుంఠపురములో
  • ముందే వస్తున్న 10కి పైగా చిన్న సినిమాలు

టాలీవుడ్ లో సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్ అంటే వేసవి. దాని తరువాత సంక్రాంతి, దసరా పండగ సీజన్ లన్న సంగతి అందరికీ తెలిసిందే. సెలవులు వరుసగా ఉంటాయి కాబట్టి, సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తాయన్న ఆలోచనతో సినిమాల విడుదలకు నిర్మాతలు సిద్ధమవుతుంటారు. ఈ సంక్రాంతి సీజన్ కు ఇద్దరు ప్రధాన హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' సహా రజనీకాంత్ నటించిన 'దర్బార్' విడుదల కానుండటంతో, థియేటర్ల కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో 13 వరకూ పెద్ద, చిన్న సినిమాలు ఈ నెలలోనే విడుదలవుతున్నాయి.

సంక్రాంతి పోటీలో నిలబడటం కన్నా, ముందుగానో, వెనుకనో సినిమాలు విడుదల చేసుకుంటేనే మంచిదన్న ఉద్దేశంతో ఉన్న వెంకటేశ్, బాలకృష్ణలు తమ తాజా చిత్రాలు 'వెంకీ మామ', 'రూరల్'లను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వీటితో పాటు మరో 10కి పైగా చిన్న చిత్రాలూ విడుదలవుతున్నాయి. కొన్ని పరభాషా చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిపై ప్రేక్షకుల అంచనాలు అధికంగానే ఉన్నాయి.

ఈ నెలలో విడుదలవుతున్న సినిమాలను పరిశీలిస్తే, 5న '90 ఎంఎల్' విడుదల కానుంది. ఆపై 6వ తేదీన ఏకంగా ఐదు చిత్రాలు వెండితెరను తాకనున్నాయి. 'మిస్ మ్యాచ్',' భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు', 'ప్రెజర్ కుక్కర్', 'బ్యూటీఫుల్', 'మథనం' చిత్రాలు రానున్నాయి. ఆపై 12న 'మామాంగం', 13న 'జుమాంజీ' విడుదల కానున్నాయి.

ఆపై 20న మరో మూడు సినిమాలు విడులవుతాయి. వాటిల్లో బాలకృష్ణ నటించిన 'రూలర్' తో పాటు సల్మాన్ ఖాన్ 'దబాంగ్-3', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలున్నాయి. ఆపై 25న 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా విడుదలవుతుంది. వెంకటేశ్ నటించిన 'వెంకీమామ' చిత్రాన్ని తొలుత జనవరి 13న విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం దీన్ని డిసెంబర్ రెండో వారంలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్మాతలు భావిస్తున్నారు.

More Telugu News