Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ... 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు!

  • తిరుమలపై భారీ వర్షాల ప్రభావం
  • దర్శనానికి 4 గంటల సమయం
  • మరికొన్ని రోజులు ఇంతేనంటున్న అధికారులు

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తిరుమల కొండపై పడింది. భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం స్వామి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. వారికి నాలుగు గంటల వ్యవధిలో దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, నడకదారి భక్తులకు దివ్యదర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

నిన్న స్వామివారిని దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, రూ. 3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది. ఇంకొన్ని రోజులు రద్దీ సాధారణంగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తిరుమలలో గత రాత్రి కూడా వర్షం పడింది. భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామి దర్శనానికి వెళుతున్నారు.

More Telugu News