Andhra Pradesh: మహిళా పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన ఏపీ హోంమంత్రి సుచరిత

  • బాధితుల పట్ల పోలీసుల తీరును పరిశీలించిన హోంమంత్రి
  • ఓ అధికారిపై అసంతృప్తి
  • మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులనే నియమించే దిశగా చర్యలు!

ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారులను గౌరవించాలని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులోని నగరంపాలెం మహిళా పోలీస్ స్టేషన్ ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.

స్టేషన్ లో తనిఖీలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా సంబంధిత పోలీసు అధికారిపై హోంమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫిర్యాదు అందగానే పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇకపై మహిళా పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులనే నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News