Rajnath Singh: విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి, కానీ మర్యాద రామన్నలా వ్యవహరించండి: బీజేపీ ఎంపీలకు రాజ్ నాథ్ దిశానిర్దేశం

  • ప్రధాని, ఆర్థికమంత్రిపై విపక్షాల విసుర్లు
  • దీటుగా బదులివ్వాలని బీజేపీ సభ్యులకు రాజ్ నాథ్ సూచన
  • సభామర్యాదను మరువరాదంటూ స్పష్టీకరణ

ప్రధాని నరేంద్ర మోదీని చొరబాటుదారు అని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను నిర్బల (బలహీన) అని విపక్షాలు విమర్శించడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వాటికి దీటుగా బదులివ్వాల్సిందేనని బీజేపీ సభ్యులకు సూచించారు.

అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్యాదకు భంగం కలిగే వ్యాఖ్యలు కానీ, అసభ్యకర పదజాలం కానీ ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సభామర్యాదకు లోబడి ఉండాలని అన్నారు. విపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీరు ఉపయోగించే భాష చాలా సభ్యతతో కూడి ఉండాలి అంటూ దిశానిర్దేశం చేశారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News