Narendra Modi: నువ్వు ఓ అద్భుతం: మోషే హోల్ట్ బర్గ్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు!

  • 26/11 దాడుల నాటికి రెండేళ్ల మోషే
  • తల్లిదండ్రులను కోల్పోయిన మోషే
  • 13 ఏళ్లు నిండటంతో ఇటీవల 'బార్ మిత్వా'
  • ప్రత్యేకంగా లేఖ రాసిన నరేంద్ర మోదీ

మోషే హోల్ట్ బర్గ్... ఈ పేరు గుర్తుందా? 26/11 ముంబై ఉగ్రదాడుల ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయిల్ బాలుడు. నాడు ముష్కరులు నారిమన్ హౌస్ పై దాడి చేసి, దొరికిన ఇజ్రాయిల్ వాసులను దొరికినట్టు కాల్చి చంపగా, మోషే అనాధగా మిగిలాడు. ఆపై ఇజ్రాయిల్ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి వెళ్లి పెరిగాడు. అతనికి 'బార్ మిత్వా' కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

జ్యూయిష్ వర్గంలో ఓ బాలుడు 13 సంవత్సరాల వయసుకు వచ్చిన తరువాత, మత పరమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతినిస్తూ, ప్రజల మధ్య ప్రార్థనలు చేసే సంప్రదాయ కార్యక్రమమే బార్ మిత్వా.

ఈ సందర్భంగా మోషేకు లేఖ రాసిన మోదీ, భారత ప్రజలంతా నిన్ను ఆశీర్వదిస్తున్నారని, నీకు దీర్ఘాయువును ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారని అన్నారు. "నువ్వో అద్భుతం. ఎంతో మందికి ఆదర్శం" అని అన్నారు. మోషే మరోసారి ముంబైకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాగా, 11 సంవత్సరాల క్రితం, నవంబర్ 26న పాక్ ముష్కరమూక ముంబైపై దాడి చేసిన వేళ, మోషే వయసు రెండు సంవత్సరాలు. నాటి దాడిలో 166 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

More Telugu News