Vanga Geetha: మహిళలను పూజించక్కర్లేదు కానీ ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడకండి: పార్లమెంటులో వంగా గీత ఆవేదన

  • దిశ ఘటనపై పార్లమెంటులో ప్రసంగించిన వంగా గీత
  • రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ విజ్ఞప్తి
  • కఠినచట్టాలు తీసుకురావాలంటూ వ్యాఖ్యలు

దిశ ఘటనపై వైసీపీ ఎంపీ వంగా గీత ఇవాళ పార్లమెంటులో గళం వినిపించారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఓ వెటర్నరీ వైద్యురాలిని 20 ఏళ్ల లోపు యువకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారని, రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు.

మహిళలను మహిళల్లాగా బతకనివ్వండి, మమ్మల్ని పూజించకపోయినా ఫర్వాలేదు, ఇలాంటి ఘటనలకు మాత్రం పాల్పడకండి, మా స్వేచ్ఛను హరించకండి అంటూ తీవ్ర భావోద్వేగాలతో ప్రసంగించారు. మహిళలను పూజిస్తామని చెప్పుకునే దేశంలో నేడు ఓ ఆడపిల్లను స్కూలుకు పంపాలంటే భయాందోళనలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర రాష్ట్రాలతో కలిసి అత్యాచార ఘటనలను అరికట్టేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని వంగా గీత విజ్ఞప్తి చేశారు.

More Telugu News