Indore: ఇండోర్ లో 67 మంది మహిళా డ్యాన్సర్లకు విముక్తి కల్పించిన పోలీసులు

  • ఇండోర్ లో పత్రికతో పాటు బార్ ను నిర్వహిస్తున్న జితేందర్ సోని
  • అమ్మాయిలను తీసుకొచ్చి బలవంతంగా డ్యాన్సర్లుగా మార్చుతున్న వైనం
  • పరారీలో జితేందర్ సోని

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ బార్ లో డ్యాన్సర్లుగా పని చేస్తున్న 67 మందికి పోలీసులు విముక్తి కలిగించారు. వివరాల్లోకి వెళ్తే, ఇండోర్ కు చెందిన జితేందర్ సోని అనే వ్యక్తి 'సంజ లోక్ స్వామి' అనే సాయంకాలం పత్రికతో పాటు, ఓ బార్ ను నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు బార్, పత్రిక కార్యాలయాలపై జిల్లా అధికారులతో కలిసి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ డ్యాన్సర్లను కాపాడి వారిని మహిళా సదన్ కు తరలించారు.

దాడుల సందర్భంగా లైవ్ బుల్లెట్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జితేందర్ ఇంట్లోని రెండు బీరువాలను సీజ్ చేశారు. ఆయనపై మానవ అక్రమ రవాణా చట్టం, ఆయుధ చట్టం కింద రెండు ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. 'సంజ లోక్ స్వామి' పత్రిక కార్యాలయానికి కూడా సీలు వేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జితేందర్ పరారీలో ఉన్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్, అసోంల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి... వారిని బలవంతంగా బార్ డ్యాన్సర్లుగా మార్చారని చెప్పారు. మరోవైపు, పత్రికా కార్యాలయంపై దాడి చేయడాన్ని ఇండోర్ ప్రెస్ క్లబ్ ఖండించింది.

More Telugu News