తమిళ హీరో విజయ్ కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన ఎన్టీఆర్!

02-12-2019 Mon 11:43
  • ఇటీవల విడుదలైన 'విజిల్'
  • విజయం సాధించడంతో ఎన్టీఆర్ అభినందన
  • తెలుగు ప్రేక్షకుల అభిమానం మరువబోనన్న విజయ్
సినిమాల పరంగా పోటీ ఉంటుందే తప్ప, నిజ జీవితంలో తామంతా స్నేహితులమేనని హీరోలంతా అంటూనే ఉంటారు. దాన్నే మరోసారి నిరూపించారు ఎన్టీఆర్. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'విజిల్' చిత్రం ఇటీవల వెండి తెరపైకి వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ఎన్టీఆర్, స్వయంగా ఫోన్ చేసి విజయ్ ని అభినందించారు.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ ప్రతినిధి కోనేరు మహేశ్, తన సోషల్ మీడియాలో వెల్లడించారు. తెలుగులో 'విజిల్' చిత్రాన్ని విడుదల చేసింది మహేశే. తాజాగా చెన్నై వెళ్లిన మహేశ్, విజయ్ ని కలిసి, ఆ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫోన్ చేసిన విషయాన్ని విజయ్ వెల్లడించారట. తన సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి విజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, తన రాబోయే చిత్రాలు కూడా ప్రేక్షకులను రంజింపజేస్తాయన్న నమ్మకం ఉందని విజయ్ చెప్పారని మహేశ్ కోనేరు వ్యాఖ్యానించారు.