Crime News: అమ్మో... వీడు మామూలోడు కాదు.. మందుల పేరుతో మాయ చేస్తాడు!

  • అర్జంట్ అంటూ హడావుడి చేసి టోకరా 
  • పెద్ద మొత్తం వ్యాపారం కావడంతో ఈజీగా ఉచ్చులో 
  • ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కేటుగాడు

అతని పేరు జంగే నర్సింహులు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి వాసి. కొన్నాళ్ల క్రితం విశాఖ మహానగరంలో అడుగు పెట్టాడు. మందులు కొనుగోలు పేరుతో మోసాలకు తెరతీశాడు. నీట్ గా టక్ చేసుకుని చూడడానికి ఓ ఉన్నత స్థాయి ఉద్యోగిలా కనిపించే ఇతని మాయలో ఇప్పటికే చాలామంది పడగా లక్షల రూపాయల విలువైన మందులు, డబ్బు కొట్టేశాడు. చివరికి పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు.


వివరాల్లోకి వెళితే... మోసం చేసే మార్గం ఎప్పుడూ ఒకటే అయితే కిక్ ఏముంటుందనుకున్నాడేమో నర్సింహులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓ చేతిలో విలువైన వస్తువు రేపర్ తో ఉన్న ప్యాకెట్, మరో చేతిలో ప్రిస్క్రిప్షన్ తో తాను ఎంచుకున్న మందుల షాపునకు వెళ్తాడు. ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టగానే షాపు యజమానికి కళ్లు జిగేల్ మంటాయి. ఎందుకంటే అన్నీ ఖరీదైన మందులే. కనీసం పది వేల రూపాయల బిల్లు ఖాయం. భలే కస్టమర్ దొరికాడని పొంగిపోతాడు. వెంటనే టపటపా మందులు తీసిస్తాడు. నర్సింహులుకు కావాల్సింది అదే.

'బిల్లు రాయండి...మా వాళ్లు ఆటోలో ఉన్నారు, అర్జంటుగా కొన్ని మందులు ఇవ్వాలంటూ వాటిని చేజిక్కించుకుంటాడు. ఈ ప్యాక్ లో విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి' అంటూ చేతిలో వున్నది అక్కడ పెడతాడు. పనిలో పనిగా కార్డు ద్వారా మొత్తం పేమెంట్ చేస్తాను. చేతిలో డబ్బుల్లేవు, మా వాళ్లకు ఇవ్వాలి. రూ.5 వేలో, రూ.2 వేలో ఇవ్వాలని పాచిక వేస్తాడు. విలువైన ప్యాకెట్ మనవద్ద ఉంది కదా, ఎక్కడికి వెళ్లిపోతాడని షాపు యజమాని అతని వలలో పడ్డాడా, మందులు, డబ్బులతో జంప్. ఒకవేళ మందులు ఇవ్వకుండా డబ్బులు మాత్రమే ఇచ్చినా పరారే.

వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందడం షాపు యజమాని వంతు. విలువైన ప్యాకెట్ అన్నాడు కదా అని విప్పిచూస్తే అందులో అన్నీ చిత్తుకాగితాలే దర్శనమివ్వడంతో కంగుతినేవారు. ఈ విధంగా విశాఖ నగరంలో జగదాంబ, ఆర్టీసీ కాం ప్లెక్స్, మద్దిలపాలెం, గాజువాక, కూర్మన్నపాలెం, మురళీనగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో మోసానికి పాల్పడ్డాడు. ఈ విధంగానే ఓ షాపు యజమాని వద్ద భారీగా నగదు కాజేయడంతో నగరంలోని మిగిలిన తన షాపు నిర్వాహకులను అ యజమాని అప్రమత్తం చేశాడు.

అనుకున్నట్టే శనివారం రాత్రి మరో షాపులో ఇదే తరహా మోసానికి పాల్పడే ప్రయత్నం చేయడంతో అక్కడి వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో విశాఖలోనేనా, ఇంకా ఎక్కడైనా ఇటువంటి మోసాలకు ఇతను పాల్పడ్డాడా? అన్న అంశం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా ఇతని చేతిలో మోసపోతే తమకు తెలియజేయాలని కంచరపాలెం పోలీసులు కోరారు.

More Telugu News