Ladies: మహిళల అభిప్రాయం... ఇండియాలో భద్రతలేని నగరాలివి!

  • మధ్యప్రదేశ్ లో భోపాల్, గ్వాలియర్
  • రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో భద్రత కరవు
  • ఓ అధ్యయనంలో వెల్లడైన మహిళల మనోగతం

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు తీవ్ర చర్చనీయాంశమైన వేళ, ఇండియాలో ఏఏ నగరాలు తమకు సురక్షితం కాదని వారు భావిస్తున్నారన్న అంశంపై సామాజిక సంస్థలు సేఫ్టీపిన్, కొరియా ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ, ఆసియా ఫౌండేషన్‌ లు సంయుక్తంగా ఓ స్టడీని నిర్వహించాయి.

ఈ అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌ లోని భోపాల్, గ్వాలియర్ లతో పాటు, రాజస్తాన్‌ లోని జోధ్‌ పూర్‌ నగరాల్లో తమకు భద్రత లేదని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ నగరాల్లో జనసాంధ్రత తక్కువగా ఉండటం, ఇతర ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు.

ఈ మూడు నగరాల్లో నివసించే విద్యార్థినుల్లో 57.1 శాతం మంది, అవివాహిత యువతుల్లో 50.1 శాతం మంది తాము ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు వెల్లడించడం గమనార్హం. అధ్యయనంలో పాల్గొన్న వారిలో భోపాల్ లో 77 శాతం మంది, గ్వాలియర్ లో 75 శాతం మంది, జోధ్ పూర్ లో 67 శాతం మంది తమకు రక్షణ లేదని చెప్పారు. ఈ నగరాల్లో డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరకడంతోనే భద్రత కరవైందని 86 శాతం మంది వెల్లడించారు. ప్రజా రవాణా సంతృప్తికరంగా లేదని 63 శాతం, ఆటోల్లోనూ ఇబ్బందులు తప్పడం లేదని 50 శాతం మంది వెల్లడించారు.

మార్కెట్ కు వెళ్లినా తమకు వేధింపులు తప్పడం లేదని 39 శాతం మంది పేర్కొనగా, రోడ్డుపై నడిచి వెళుతుంటే వేధించారంటూ 26 శాతం మంది, బస్ లేదా ఆటో కోసం వేచి చూస్తుంటే ఏడిపిస్తున్నారని 16 శాతం మంది మహిళలు వెల్లడించారు.

More Telugu News