kharge: బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది: కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే

  • కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీకి గుణపాఠం చెప్పాల్సి ఉంది
  • రాష్ట్రంలో జేడీఎస్ తో మళ్లీ కలవడానికి మేము సుముఖంగానే ఉన్నాము
  • మహారాష్ట్రలో నియంతృత్వ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనుకున్నాం 
  • అందుకే శివసేన, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాం

రాజ్యాంగాన్ని, అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాజ్యాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. కర్ణాటకలో ఏం జరుగుతుందో చూద్దాం. కేంద్రం, రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో 15 సీట్లలోనూ గెలిచి, బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు.

'కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో జేడీఎస్ తో మళ్లీ కలవడానికి మేము సుముఖంగానే ఉన్నాము. ఓటర్లకు బీజేపీ డబ్బు పంచుతోంది. ఈ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఓటర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. డబ్బు పంచినా ఫలితాలు దక్కని అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తే, మతపర సమస్యలను రేపి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడదు' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

'రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని బీజేపీ నేతలు అన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినప్పటికీ కేంద్ర నుంచి నిధులు రాలేదు. కర్ణాటక గురించి ప్రధాని మోదీ మాట్లాడలేదు.. రాష్ట్రంలో ఆయన పర్యటించలేదు' అని ఖర్గే అన్నారు.

'కర్ణాటకను మోదీ ద్వేషిస్తున్నారని భావిస్తున్నాను. దీనికి గల కారణం నాకు తెలియదు. ఆయన యెడియూరప్పను ద్వేషిస్తున్నారు.. అందుకే రాష్ట్రాన్ని కూడా ద్వేషిస్తున్నారా? అన్న విషయం తెలియదు. ఆయన రాష్ట్రానికి ఎన్నడూ సాయం అందించలేదు. నియంతృత్వ బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచేందుకే మేము మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాం' అని ఖర్గే వివరించారు.

More Telugu News