బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 'లిమోలైనర్' బస్సు బోల్తా!

01-12-2019 Sun 06:59
  • నిన్న రాత్రి బెంగళూరులో బయలుదేరిన బస్సు
  • అతివేగంతో అదుపుతప్పి బోల్తా
  • రాజస్థాన్ కు చెందిన మహిళ మృతి
నిన్న రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ 'లిమోలైనర్'కు చెందిన బస్సు అనంతపురం శివార్లలో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుండగా, ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. బస్సులోని వారిలో 15 మందికి గాయాలు కాగా, వారిని అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

మరణించిన మహిళ, రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సుచిత్ర (38)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అనంతపురంలోని తపోవనం కూడలి వద్ద ఈ ప్రమాదం జరుగగా, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.