Davis Cup: డేవిస్ కప్ లో లియాండర్ పేస్ వరల్డ్ రికార్డు

  • 44 డబుల్స్ విజయాలతో పేస్ ఘనత
  • పెట్రాంజలి 43 విజయాల రికార్డు తెరమరుగు
  • పాక్ జోడీపై నెగ్గిన పేస్-జీవన్ జంట

భారత టెన్నిస్ రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాళ్లలో లియాండర్ పేస్ ముందు వరుసలో ఉంటాడు. 46 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ఆటతో, కుర్రాళ్లకు దీటైన ఫిట్ నెస్ తో టెన్నిస్ యవనికపై కాంతులీనుతున్నాడు. తాజాగా పేస్ అద్భుతమైన ఆటతీరుతో వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం భారత టెన్నిస్ జట్టు పాకిస్థాన్ తో డేవిస్ కప్ మ్యాచ్ లు ఆడుతోంది. తటస్థ వేదిక కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ లో జరుగుతున్న ఈ పోటీల్లో లియాండర్ పేస్-జీవన్ నెడుంజెళియన్ జోడీ పాక్ కు చెందిన మహ్మద్ షోయబ్-హఫైజా అబ్దుల్ రెహ్మాన్ జంటను వరుస సెట్లలో ఓడించింది.

డేవిస్ కప్ చరిత్రలో లియాండర్ పేస్ కు ఇది 44వ డబుల్స్ విజయం. ఈ విక్టరీతో ఇటలీకి చెందిన నికోలా పెట్రాంజలి 43 విజయాల రికార్డును పేస్ దాటేశాడు. పెట్రాంజెలి 66 మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించగా, మన పేస్ 56 మ్యాచ్ ల్లోనే వరల్డ్ రికార్డు అందుకున్నాడు. సమకాలీన క్రీడాకారుల్లో ఎవరూ పేస్ కు దరిదాపుల్లో లేరు.

More Telugu News