Rajeevgandhi murder case: జీవితంపై విరక్తి కలుగుతోంది...చనిపోయేందుకు అనుమతించండి: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని

  • కారుణ్య మరణం కోసం ప్రధానికి లేఖ రాసినట్టు సమాచారం
  • 28 ఏళ్లుగా జైల్లో ఉన్న తమను విడుదల చేయాలని వేడుకోలు
  • స్పందన లేకపోవడంతో తాజా ఉత్తరం

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటనలో దోషిగా తేలి గడచిన 28 ఏళ్లుగా వేలూరు మహిళా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న నళిని తనను చనిపోయేందుకు అనుమతించాలని (కారుణ్య మరణం) కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబదూర్లో మానవ బాంబు దాడిలో రాజీవ్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 


ఈ దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నళిని, ఆమె భర్త మురుగన్ లు ఇద్దరినీ దోషులుగా పేర్కొంటూ కోర్టు శిక్ష విధించింది. నళినికి మరణ శిక్ష విధిస్తూ 1998, జనవరి 28న ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇవ్వగా దాన్ని జీవిత ఖైదుగా మారుస్తూ అప్పటి తమిళనాడు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, భర్త మురుగన్ కు పడిన మరణశిక్షను తర్వాత సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది.

వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. తాము సుదీర్ఘకాలం నుంచి జైల్లో ఉన్నామని, తమను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతూ నళిని, ఆమె భర్త పలుమార్లు ప్రభుత్వాన్ని, న్యాయ స్థానాలను కోరుతూ వస్తున్నారు. ఇందుకోసం జైల్లో వీరు నిరాహార దీక్షలు కూడా చేశారు.

అయినా ఎటువంటి స్పందన లేదు. దీంతో తమకు జీవితంపైనే విరక్తి కలుగుతోందని, చనిపోవాలని భావిస్తున్నామంటూ కారుణ్య మరణానికి లేఖ రాసినట్లు సమాచారం. నిన్నంతా ఈ వార్త మీడియాతోపాటు, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

More Telugu News