Nizamabad District: చనిపోతున్నట్టు లేఖ రాసి హాస్టల్ నుంచి వెళ్లిపోయిన విద్యార్థి.. దొరకని ఆచూకీ!

  • రెండు రోజులుగా గాలిస్తున్నా ఫలితం శూన్యం
  • స్వగ్రామానికి చెందిన యువకుడితో చివరి ఫోన్ కాల్
  • తనను ఓ యువకుడు వేధిస్తున్నాడని చెబుతూ కన్నీళ్లు

తాను చనిపోతున్నట్టు లేఖ రాసి హాస్టల్ నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని (20) ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యువతి (20) నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్ లోని ఓ హాస్టల్‌లో ఉంటూ కేశవ స్మారక కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.

రెండు రోజుల క్రితం తాను ట్యాంక్‌‌బండ్‌ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసిన విద్యార్థిని హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. విషయం పోలీసులకు చేరడంతో రంగంలోకి దిగారు. ఆమె కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ  కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. తన స్వగ్రామమైన నవీపేటకు చెందిన స్నేహితుడితో విద్యార్థిని రోజూ గంటల తరబడి మాట్లాడుతున్నట్టు కాల్ డేటా ఆధారంగా బయటపడింది. ఆమె అదృశ్యమైన రోజు కూడా చివరి ఫోన్ కాల్ అతడికే వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

కాగా, బుధవారం ఉదయం తాను చనిపోతున్నట్టు వాట్సాప్‌లో ఆమె మెసేజ్ పెట్టిందని సదరు యువకుడు తెలిపాడు. దీంతో తనను ఆటపట్టించడానికే అలా చేస్తోందని అనుకున్నానని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫోన్ చేసి హుస్సేన్‌సాగర్‌ వైపు వెళ్తున్నానని, దూకి చనిపోతానని చెప్పడంతో వెంటనే ఫోన్ కట్ చేసి అదే హాస్టల్‌లో ఉంటున్న ఆమె అక్కను అడిగితే ఇప్పుడే తను బయటకు వెళ్లినట్టు చెప్పిందన్నాడు. ఆ తర్వాత కాసేపటికే స్నేహితురాలు తనకు వీడియో కాల్ చేసి తాను ట్యాంక్‌బండ్‌పై ఉన్నట్టు పరిసరాలను చూపించిందన్నాడు.

ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని చెప్పిందని అతడు వివరించాడు. దీంతో పలానా వ్యక్తా? అని పేరు చెప్పగానే అతడేనని చెప్పిందన్నాడు. వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడని చెప్పి కన్నీళ్లు పెట్టుకుందన్నాడు. ఆ తర్వాత ఫోన్ కట్ అయినట్టు యువకుడు తెలిపాడు. కాగా, యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

More Telugu News