Telangana: మదమెక్కిన మగపిశాచుల దాష్టీకం: అత్యాచార ఘటనలపై స్పందించిన విజయశాంతి

  • తెలంగాణ సమాజానికి ఇది తీరని అవమానం
  • ప్రభుత్వం మేల్కొనకపోతే మహిళా ఉద్యమం తప్పదు
  • కాబోయే అమ్మలు వద్దని అబార్షన్లు చేయించుకునే పరిస్థితి తేవొద్దు

తెలంగాణలో జరుగుతున్న వరుస అత్యాచార, హత్యల ఘటనపై తెలంగాణ కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విజయశాంతి ఫేస్‌బుక్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మదమెక్కిన మగ పిశాచాల దాష్టీకానికి మాతృ హృదయం తల్లడిల్లిపోతోందన్నారు. ఇది సభ్య సమాజానికే తీరని కళంకమన్నారు. కామాంధుల కర్కశానికి ఓ వైద్యురాలు బలైపోయిందన్నారు.  తెలంగాణ సమాజానికి ఇది తీరని అవమానమని విజయశాంతి అన్నారు.

ఇక, వరంగల్‌లోనూ అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. సమిధలుగా మారుతున్నది ప్రియాంక, మానసలే కాదని, గొప్పగా చెప్పుకునే మానవత్వం కూడానని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొనకపోతే మహిళా ఉద్యమం తథ్యమని హెచ్చరించారు. విశ్వ నగరంలో అతివకు రక్షణ కరువైందన్నారు. షీ టీంలు, మహిళా భద్రత ఎండమావిగా మారాయన్నారు. అర్ధరాత్రి అతివ స్వేచ్ఛగా  తిరిగే రోజులు రావాలని ఆకాంక్షించారు.

ఇలాంటి ఘాతుకాలకు తెగబడే ముందు అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములు ఒక్క క్షణం ఆలోచించాలని విజయశాంతి కోరారు. కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్లు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు గుర్తుకు రావడం లేదని ప్రశ్నించారు. మగపిల్లలను కనాలంటే కాబోయే అమ్మలు వద్దని అబార్షన్లు చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని సృష్టించవద్దని విజయశాంతి కోరారు.

More Telugu News