Ashwathama Reddy: యూనియన్లు ఉండాలా? వద్దా? అన్నదానిపై కార్మికులతో రిఫరెండం నిర్వహించండి: అశ్వత్థామరెడ్డి

  • కొన్ని దశాబ్దాలుగా ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి
  • కార్మిక సంఘాలు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాయి  
  • కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడం తగని చర్య

కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగించడంపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు  ఈ రోజు విధుల్లో చేరిన సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని చెప్పడం సంతోషదాయకమన్నారు. యూనియన్లు ఉండాలా? వద్దా? అన్నది లేబర్ కోర్టు స్పష్టం చేస్తుందన్నారు.

అవసరమొస్తే యూనియన్ల నేతలమందరం విధుల్లోకి వెళతామని...కార్మికులతో రిఫరెండం పెట్టి యూనియన్లు ఉండాలా? వద్దా? అన్నది తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ట్రేడ్ యూనియన్లున్నాయన్నారు. కార్మిక సంఘాలతో పాటు పలు సంఘాలు తెలంగాణ పోరాటంలో ముందునడిచాయని చెప్పారు. చట్ట ప్రకారం కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులుంటాయన్నారు. కార్మిక సంఘాలకు కల్పించే డ్యూటీ మినహాయింపుపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని అభ్యర్థించారు.
 
‘కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవు. అవసరమొస్తే యూనియన్ల నేతలమంతా విధుల్లోకి వెళతాం. ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. తక్షణమే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని కోరామన్నారు. సమస్యలపై లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామన్నారు.

More Telugu News