Sujana Chowdary: విజన్ స్టేట్ మెంట్లతో చంద్రబాబు కాలం గడిపేశారు: సుజనా చౌదరి విమర్శలు

  • అమరావతి అంశంపై సుజనా స్పందన
  • చంద్రబాబు విజన్ స్టేట్ మెంట్లపై విమర్శలు
  • కాగితాలు, సినిమాలకే పరిమితం అంటూ వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లు చంద్రబాబునాయుడు చేయగలిగిన దానికంటే ఎక్కువగా చెబుతూ, విజన్ స్టేట్ మెంట్లతో కాలం గడిపేశారని ఆరోపించారు. కొన్ని పనులు మొదలైనా, మరికొన్ని పనులు కాగితాలు, సినిమాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఈ ఆర్నెల్లలో రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు కొద్దో గొప్పో కంపెనీలు వచ్చినా, ఇప్పుడు వాళ్లందరూ పారిపోయే పరిస్థితి నెలకొందని సుజనా చౌదరి ఆరోపించారు. కోర్టు చెప్పినా వినడం లేదు, కేంద్రం చెప్పినా వినడంలేదని రాష్ట్ర సర్కారుపై అసహనం వ్యక్తం చేశారు. "స్థానికులకే 75 శాతం ఉద్యోగాలంటున్నారు. మరి పక్క రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిబంధన అమలు చేసి తెలుగువాళ్లందరినీ పంపించివేస్తే, వారందరికీ ఉద్యోగాలు ఇవ్వగల స్థితిలో రాష్ట్రం ఉందా?" అని ప్రశ్నించారు.

రాజధానిలో రైతులను అయోమయ పరిస్థితిలో పడేశారని, అమరావతిలో ఆర్నెల్ల పాటు పనులు ఆపేసి ఇప్పుడు మళ్లీ ఎందుకు పనులు మొదలుపెట్టమని చెబుతున్నారో తెలియడంలేదని అన్నారు.

More Telugu News