Telangana: ఆర్టీసీ కార్మికులకు భోజనం పెట్టి నేరుగా చర్చించనున్న కేసీఆర్.. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులకు ఆహ్వానం

  • 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులకు ఆహ్వానం
  • డిసెంబర్ 1న ప్రగతి భవన్ లో సమావేశం 
  • కార్మికులు రావడానికి రవాణా సౌకర్యం  

రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న ప్రగతి భవన్ లో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారు రావడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారని ట్వీట్ చేసింది.

ఈ సమావేశానికి పిలిచే ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం కోరారని వివరించింది. డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల కల్లా కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారని పేర్కొంది.
 
మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడుతారని సీఎంవో పేర్కొంది. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తారని, ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలను ఆహ్వానించారని వివరించింది.

More Telugu News