Telangana: తెలంగాణలో మొదలు కానున్న ఎన్నికల సందడి... మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

  • ఎన్నికలపై ఉన్న స్టే ఎత్తివేత
  • మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు
  • జనవరి నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి కనిపించనుంది. రాష్ట్రంలోని 73 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిపించేందుకు కొద్దిసేపటి క్రితం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునిసిపల్ ఎన్నికలపై ఉన్న స్టేను ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన హైకోర్టు, తిరిగి మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికలు జరిపించాలని సూచించింది.

ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదంటూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలపై గత కొన్ని నెలలుగా హైకోర్టులో వాదప్రతివాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం, నేడు తీర్పును ప్రకటించింది.

 కాగా, ఈ సంవత్సరం జనవరి 1 నాటికి నమోదైవున్న ఓటర్ల జాబితా ప్రకారమే మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది.

More Telugu News