Uddhav Thackeray: మోదీ, ఉద్ధవ్ థాకరేలు అన్నదమ్ముల వంటివారు.. అసెంబ్లీ, సెక్రటేరియట్ లపై కాషాయ జెండా ఎగురవేశాం: శివసేన

  • మోదీ ఏ ఒక్క పార్టీకో చెందిన వారు కాదు
  • మహారాష్ట్ర అభివృద్ధికి మోదీ సహకారం అందిస్తారు
  • థాకరే సీఎం కావడం ఒక విప్లవం

సీఎం పదవి కోసం పట్టుబట్టి, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన... చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నాటకీయ పరిణామాలన్నీ సంభవిస్తున్న వేళ... బీజేపీపై శివసేన నేతలు తీవ్ర విమర్శలే చేశారు.

తాజాగా, వారి స్వరం మారింది. ప్రధాని మోదీ, ఉద్ధవ్ థాకరే ఇద్దరూ అన్నదమ్ముల వంటివారని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన కథనంలో పేర్కొంది. మోదీ ఏ ఒక్క పార్టీకో చెందిన వారు కాదని... యావత్ దేశానికి ఆయన ప్రధాని అని తెలిపింది. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ తన వంతు సహకారాన్ని అందిస్తారని పేర్కొంది. ఇదే సమయంలో కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా చేసింది.

ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఒక విప్లవం వంటిదని సామ్నా తెలిపింది. గత ఫడ్నవిస్ ప్రభుత్వం మహారాష్ట్రకు రూ. 5 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో, థాకరే వేగంగా అడుగులు వేయాల్సి ఉందని... ఇదే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని అభిప్రాయపడింది.

రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ నిధులు రావాల్సిన అవసరం ఉందని సామ్నా తెలిపింది. మహారాష్ట్ర ప్రజల నిర్ణయాన్ని ఢిల్లీ గౌరవించాలని సూచించింది. తమ బలమేంటో ఢిల్లీకి మహారాష్ట్ర చూపించిందని తెలిపింది. ఢిల్లీకి ఎక్కువ డబ్బులు మహారాష్ట్ర నుంచే వెళ్తున్నాయని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థ ముంబై పైనే ఆధారపడి ఉందని తెలిపింది. దేశంలోనే అత్యంత ఎక్కువ ఉపాధిని ముంబై కల్పిస్తోందని చెప్పింది.

ఇక దేశ సరిహద్దులకు సంబంధించి కూడా మహారాష్ట్ర సహకారమే ఎక్కువగా ఉందని... ఈ నేపథ్యంలో, మహారాష్ట్రకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని తెలిపింది. శాసనసభ, సెక్రటేరియట్ లపై కాషాయ జెండాను ఎగురవేశామని... సరికొత్త మార్గంలో వెళ్తున్న మహారాష్ట్రకు ఇది ప్రారంభమని పేర్కొంది.

More Telugu News