Anantapur District: అల్లరి చేస్తున్నారంటూ పిల్లలను బెంచీలకు కట్టేసిన వైనం .. విలవిల్లాడిన పసి హృదయాలు!

  • అనంతపురం జిల్లా మశానం పేటలో ఘటన
  • వరుసగా రెండు రోజులు సంఘటన
  • విద్యార్థి సంఘాల ఆందోళనతో అధికారుల విచారణ

పిల్లల పట్ల సానుభూతితో ఉండాలి. పసివాళ్ల మనసు కష్ట పెట్టకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పించాలి. పాఠశాల కూడా తమ ఇల్లు లాంటిదే అన్నంత సంతోషం చిన్నారుల్లో కనిపించాలి. కానీ కొందరు ఉపాధ్యాయుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అల్లరి చేస్తున్నారనో, చెప్పింది వినడం లేదనో, మరో కారణమో చూపి పసివాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ విస్తుగొలిపేలా చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరిలోని మశానం పేట మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ సంఘటనే అందుకు ఓ ఉదాహరణ.

తప్పుచేసే విద్యార్థులకు శిక్షగా వారిని బెంచీలకు, కుర్చీలకు తాళ్లతో కట్టేస్తున్నారు. కాళ్లు, చేతులు కలిపి కట్టేస్తుండడంతో కనీసం కదల్లేని స్థితిలో విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. బుధవారం ఈ పాఠశాలలో ఓ విద్యార్థిని ఇలాగే కట్టేశారు. నిన్న రెండు, మూడు తరగతులు చదువుతున్న మరో ఇద్దరిని బెంచీలకు కట్టేశారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించాయి. ఆర్డీవో రామసుబ్బయ్య, ఎంఈఓ చెన్నకృష్ణ సంఘటనపై పాఠశాలలో విచారణ జరిపారు. బాధ్యులెవరో తెలుసుకునేందుకు విద్యార్థులను విచారించారు. అయితే... విద్యార్థులు అల్లరి ఎక్కువగా ఉందని చెబితే వారి తల్లిదండ్రులే వచ్చి ఇలా కట్టి వెళ్లిపోయారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి చెప్పడం కొసమెరుపు.

More Telugu News