Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రం నష్టపోతోంది: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

  • ఏపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నష్టం
  • పలు సంస్థలు తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి
  • ఈ విషయమై ప్రధాని మోదీ కలుగజేసుకోవాలి

ఏపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రం నష్టపోతోందని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడులను పెంచేందుకు, ఆర్థిక వృద్ధి సాధించేందుకు ఓ వైపు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఏపీ నుంచి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న కాంట్రాక్టుల రద్దు, పీపీఏలపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ వంటి అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొన్ని దేశాలు చట్టపరమైన చర్యలకు దిగాయని, ఇలాంటి చర్యలు ఏపీతో పాటు దేశ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. రూ.2200 కోట్లకు సంబంధించి లులూ గ్రూప్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రాజెక్టును, బీఆర్ శెట్టి గ్రూపు రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టును, రెండు వేల కోట్లతో ఏర్పాటు చేసే ప్రతిపాదనను కియా పరిశ్రమ విరమించుకున్నాయని, డానీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి 400 ఎకరాల స్థలాన్ని 89 ఎకరాలకు తగ్గించేశారని విమర్శించారు.

అలాగే, తిరుపతిలో రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన రిలయన్స్ సంస్థ, ఒంగోలులో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కావాల్సిన కాగిత పరిశ్రమ వెళ్లిపోయాయని, రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం కూడా పక్కకు తప్పుకుందన్న జయదేవ్, ఈ విషయమై ప్రధాని మోదీ కలుగజేసుకుని దేశ ప్రతిష్టను, విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం వుందని అన్నారు.

More Telugu News