నాకు రాజకీయాలు అవసరం లేదంటూ మరోసారి కంటతడి పెట్టిన కుమారస్వామి

28-11-2019 Thu 10:16
  • జేడీఎస్ సమావేశంలో భావోద్వేగానికి గురైన కుమారస్వామి
  • తన కుమారుడి ఓటమిపై కంటతడి
  • నారాయణగౌడ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కంటతడి పెట్టారు. మండ్య జిల్లాలోని కిక్కేరి గ్రామంలో జేడీఎస్ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు నిఖిల్ ఓటమి చెందటాన్ని తలచుకుని కంటతడి పెట్టారు. మండ్య ప్రజలను తాను నమ్ముకున్నానని... మీరే నన్ను దూరం పెడితే ఎలాగని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి నారాయణగౌడ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న నారాయణగౌడ రాసిన లేఖను చదివి కన్నీరు కార్చారు. ఈ ఘటనతో షాక్ కు గురైన పార్టీ నేతలు... ఆయనను సముదాయించారు.

తనకు రాజకీయాలు, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని కుమారస్వామి అన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు మాత్రమే తనకు కావాలని చెప్పారు. తనకు కుమారుడు ఎందుకు ఓడిపోయాడో తనకు అర్థం కావడం లేదని... మండ్య నుంచి నిఖిల్ పోటీ చేయాలని తాను భావించలేదని... మండ్య ప్రజలే నిఖిల్ పోటీ చేయాలని కోరారని... కానీ, చివరకు నిఖిల్ కు వారే సపోర్ట్ చేయలేదని... ఇది తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.