KCR: కేసీఆర్ పంజా విసరబోతున్నారు... జాగ్రత్త: ఫేస్ బుక్ లో నటి విజయశాంతి

  • ఆర్టీసీని నిర్వీర్యం చేసిన కేసీఆర్
  • మిగతా వ్యవస్థలకూ ఇదే గతి
  • టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు

తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేసినట్టుగానే, మిగతా వ్యవస్థలను నాశనం చేసేందుకు కేసీఆర్, తన పంజాను విసిరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందని, ఉద్యోగులంతా జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టిన ఆమె, టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా నిప్పులు చెరిగారు.

విజయశాంతి పెట్టిన పోస్ట్ ఇది...
"ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని... మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి కెసిఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు... ఆర్టీసీ సమ్మె ను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చ పోతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం... దాని ద్వారా మొత్తం వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకోవడం కేసీఆర్ గారి వ్యూహంగా కనిపిస్తోంది.

ఆర్టీసీతో మొదలైన కెసిఆర్ ప్రభుత్వ అరాచకం, రెవెన్యూ శాఖకు కూడా విస్తరించి.. అక్కడినుంచి మిగిలిన శాఖలకు కూడా వ్యాపించబోతోందన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలపడుతున్నాయి. సచివాలయం లేకుండా ప్రగతి భవన్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను చక్కపెడుతున్న సీఎం దొరగారు.. అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయాలనుకోవడం దురదృష్టకరం. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని చేతులు దులుపుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.. సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని వితండవాదం చేస్తోంది. కేసిఆర్ ప్రభుత్వ వాలకం చూస్తుంటే మెట్రో రైలు స్టేషన్ పెచ్చులు ఊడిపడి అమాయకురాలు ప్రాణాలు కోల్పోతే... దాని బాధ్యత కూడా ప్రతిపక్షాలదే అంటారేమో?

అంతేకాదు.. మొన్న ఓ లారీ డ్రైవర్ తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ గా బస్సును దురుసుగా నడిపి ఓ ఐ.టి. ఉద్యోగి ప్రాణాలు తీసిన ఘటనకు కూడా ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తారేమో? ఇవే కాదు, హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందకి దూసుకువచ్చి ప్రాణాలు తీసిన ప్రమాదానికి కూడా ప్రతిపక్షాల కుట్రే కారణమని దొరగారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! తన వైఫల్యాలను ప్రతిపక్షాల మీదకు నెట్టడం కెసిఆర్ గారికి కొత్తేమీ కాదు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ అరాచకానికి సరైన తీర్పుని సంఘటిత పోరాటాల ద్వారా తెలియచేస్తారని విశ్వసిస్తున్నాను"-
విజయశాంతి
తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్‌ పర్సన్

More Telugu News