Ajit Pawar: అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి?

  • తొలుత బీజేపీతో నడిచేందుకు అజిత్ నిర్ణయం
  • ఆపై మనసు మార్చుకుని ఎన్సీపీలో చేరిక
  • రేపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం

పార్టీని చీల్చి, బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకుని, ఆపై మనసు మార్చుకున్న అజిత్ పవార్ ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్షమించేశారని తెలుస్తోంది. రేపు సాయంత్రం శివసేన నేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆయనతో పాటే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థారట్, ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తోంది.

కాగా, నాలుగు రోజుల క్రితం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటే డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఎన్సీపీకి అజిత్ పవార్ వెన్నుపోటు పొడవటం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆ వెంటనే వ్యూహాత్మకంగా పావులు కదిపిన శరద్ పవార్, ఎమ్మెల్యేలు అజిత్ వెంట నడవకుండా కట్టడి చేయడంలో కృతకృత్యులయ్యారు. కుటుంబ సభ్యులను రంగంలోకి దించి, అజిత్ ను బుజ్జగించారు.

దీంతో నిన్న ఉదయం తన పదవికి అజిత్ రాజీనామా చేయగా, బలపరీక్షలో విజయం సాధించే పరిస్థితులు కనిపించక, దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తన పదవిని వీడక తప్పలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉండగా, అది ముగియగానే స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికలోనే ఏ పక్షం బలం ఎంతన్న విషయం తేలిపోనుంది.

More Telugu News