Pakistan: వద్దన్నా ఉద్యోగం చేస్తోందని.. జర్నలిస్టును కాల్చి చంపిన భర్త

  • పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన
  • భార్యాభర్తలు ఇద్దరూ జర్నలిస్టులే
  • కార్యాలయంలోకి దూరి తుపాకితో కాల్పులు

వద్దన్నా ఉద్యోగం చేస్తోందన్న అక్కసుతో భార్యను తుపాకితో కాల్చి చంపాడో భర్త. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దిలావర్ అలీ, ఉరూజ్ ఇక్బాల్ (27) భార్యాభర్తలు. ఏడు నెలల క్రితం వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ జర్నలిస్టులే. ఉరూజ్ ఓ ఉర్దూ పత్రికలో పనిచేస్తుండగా, మరో ఉర్దూ పత్రికలో దిలావర్ పనిచేస్తున్నాడు.

పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయమని ఉరూజ్‌ను భర్త దిలావర్ పలుమార్లు కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ ఆమె ఉద్యోగాన్ని వదలకపోవడంతో మరింత ఒత్తిడి పెంచాడు. దీంతో విసిగిపోయిన ఉరూజ్ అతడి నుంచి దూరం జరిగి తాను పనిచేసే కార్యాలయం పక్కనే ఓ గదిలో ఉంటోంది. దీంతో మరింత రగిలిపోయిన దిలావర్ ఆమె పనిచేస్తున్న కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. తలలోకి తూటాలు దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఉరూజ్ సోదరుడు ఇక్బాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి తన సోదరిని దిలావర్ వేధిస్తున్నాడని ఇక్బాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడి తెచ్చాడని పేర్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోలేదని, అందుకనే ఈ ఘాతుకం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News